Thursday 7 April 2016

Devullu - Aanandabala Telugu story

2 comments:

            దేవుళ్ళు

   లేఖ చాలా చిన్న పిల్ల. ఇంకా బడిలో చేర్చ లేదు. ఒకరోజు చిన్నారి లేఖ వాళ్ళ  అమ్మతో కలిసి గుడికి వెళ్ళింది. అలా అమ్మతో బయటికి వెళ్ళడమంటే ఆమెకు చాలా ఇష్టం. అలా వెళ్ళినప్పుడల్లా అమ్మ ఏదైనా కొనిస్తే ఇంకా ఆనందం. గుడిలో దేవుడికి దండం పెట్టుకున్నాక అమ్మ, లేఖ  గుడి మంటపంలో చాలా సేపు కూర్చున్నారు. లేఖ చుట్టూ పక్కల అంతా పరిశీలనగా చూస్తోంది. ఓ చోట ఓ సాధువు కళ్ళు మూసుకొని ఏదో పాడుకుంటున్నాడు. 

"అమ్మా! అతను ఏం చేస్తున్నాడు?" అడిగింది లేఖ.

"దేవుడి కోసం పాడుతున్నాడు." చెప్పింది అమ్మ.
 "అమ్మా! అతనికి అన్నం ఎవరు పెడతారు?" అడిగింది లేఖ.
"ఆ దేవుడే పెడతాడు...." చెప్పింది అమ్మ.
 "బట్టలేవరిస్తారు?" అడిగింది లేఖ.
"ఆ దేవుడే ఇస్తాడు...." చెప్పింది అమ్మ.
 "అతనికి డబ్బులెవరిస్తారు?" అడిగింది లేఖ.
"ఆ దేవుడే ఇస్తాడు...." చెప్పింది అమ్మ.
ఇంతలో గుడి బయట ఐస్ క్రీం బండి గంట వినిపించింది. లేఖ అమ్మను ఐస్ క్రీం కొనమంది. అమ్మ ఐస్ క్రీం తేవడానికి వెళ్ళింది.  లేఖ ఆ సాదువునే అలా పరిశీలిస్తూ కూర్చుంది. గుడి నుంచి వెళిపోతున్న భక్తుల్లో ఒకతను ఆ సాదువుకు డబ్బులిచ్చి వెళ్ళాడు. మరొకామె విస్తరి నిండా భోజనం పెట్టి వెళ్ళింది. ఇద్దరు దంపతులు ఆ సాధువుకు కొత్త బట్టలిచ్చి నమస్కరించి వెళ్ళారు. అమ్మ లేఖ దగ్గరకు వచ్చి, ఐస్ క్రీం ఇచ్చి "పద.. మనం ఇంటికి వెల్లిపోదాం.."అంటూ ఆమెను తీసుకుని అక్కడనుండి బయటపడింది.
మార్గ మధ్యంలో అమ్మ " లేఖా.. నువ్వు దేవుడుని చూశావా..?" అని అడిగింది. "చూసానమ్మా.. ముగ్గురు దేవుళ్ళను చూసాను. దేవుళ్ళు ఆ సాధువుకి నువ్వు చెప్పినట్టే అన్నీ ఇస్తారమ్మా.." అంది అమాయకంగా. "ముగ్గురు దేవుళ్ళా...?" అంటూ లేఖ అమాయకత్వానికి నవ్వుకుంది అమ్మ.
              రచన: తుంబలి శివాజీ.