Wednesday 28 October 2015

చిట్టి కథలు-14

                      థూ .. థూ.. తూచు యంత్రం!
డుంబుకి నాన్న పది రూపాయలు ఏమైనా కొనుక్కోమని ఇచ్చాడు. డుంబు బడిలోకి వెళ్ళే ముందు బయట ఉన్న బరువు తూచే యంత్రంలో ఒక రూపాయి వేశాడు.  చక్రం గిర్రున తిరిగి ఒక టికెట్ వచ్చింది. అందులో డుంబు బరువుతో పాటు వెనుక ‘మీకు ఎక్కువగా చిరుతిళ్ళు లభిస్తాయి’ అని ముద్రించి ఉంది. మరో రూపాయి యంత్రంలో వేశాడు. ఈ సారి ‘మీకు కోరుకున్నంత డబ్బు వస్తుంది’ అని వచ్చింది. మరో రూపాయి వేశాడు. ‘ఈ ఏడాది బడికి ఎక్కువగా సెలవులు ఉంటాయి’ అని వచ్చింది. తొమ్మిది సార్లు తొమ్మిది రకాలుగా తనను ఆనందపరచే వాక్యాలే వచ్చాయి. నాన్న చిరుతిల్లు కొనుక్కోమని డబ్బులిచ్చినా వాటిని ఇలా వాడడం ఎంతో సంతోషం కలిగించింది.
ఇంకా ఒక్క రూపాయి మాత్రమే మిగిలింది. ‘ఈ రూపాయి ఏవైనా చిరుతిళ్ళు కొనుక్కోవాలా? యంత్రంలో వేయాలా? ’ అని ఆలోచించి, చివరకు యంత్రంలోనే వేశాడు. ఈ సారి టికెట్లో వచ్చిన వాక్యం చూసి డుంబు ఖంగుతిన్నాడు. ‘మీరు అబద్దాల్ని ఎక్కువగా నమ్ముతారు’ అని వచ్చింది. ఈ విషయం తెలిసి అందరూ నవ్వుకుంటారని ఎవరితోనైనా చెప్పుకోవాలన్నాసిగ్గేసింది డుంబుకి.

                      రచన: తుంబలి శివాజీ

5 comments: