Wednesday 17 February 2016

No comments:
   ప్రముఖ సినిమా రచయిత, నాటకకర్త, కథకులు శ్రీ నడిమింటి నరసింగ రావు గారు ఈ రోజు (17.2.2016) గుంప సోమేశ్వర క్షేత్రం లో భద్రకాళి ప్రతిష్టాపన కోసం సతీ సమేతంగా  విచ్చేశారు. వారు చిన్నపిల్లకోసం ఆనందబాల చేస్తున్న కృషిని ఎంతగానో కొనియాడారు. వారికి ఆనందబాల ధన్యవాదాలు తెలియజేసుకొంటోంది.

   శ్రీ నరసింగ రావు గారి జన్మ స్థలం కురుపాం (విజయనగరం జిల్లా) . జాతీయ స్థాయిలో నిలబడిన ఏకైక తెలుగు నాటకం "బొమ్మలాట" రచయిత శ్రీ నడిమింటి నరసింగ రావు గారు. రాంగోపాల్ వర్మ "అనగనగా ఒక రోజు", "కళ్ళు" వంటి ఎన్నో సినిమాలకు మాటలను అందించారు.  ఈ టీవీ లో  ఎన్నో డైలీ సీరియల్స్ కి మాటలు అందించారు. వారితో నేను కలిసి ఈ టీవీ "శ్రీభాగవతం" సీరియల్  కి మాటలను రాయడం జరిగింది.
                                          - తుంబలి శివాజీ  

Thursday 4 February 2016

No comments:
బాల సాహితీవేత్తల కథలు-1

                             ధర్మబుద్ధి

చంద్రయ్య, ధర్మయ్య ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ దైవదర్శనానికని కాలినడకన కాశీ బయలుదేరారు. కొంత దూరం నడిచిన తరువాత వారిరువురూ అడవిలో ప్రవేశించారు. కాసేపటికి వారిద్దరికీ ఆకలి వేసింది. దగ్గరలో ఉన్న చెట్టు క్రింద చేరి కాసేపు విశ్రాంతి తీసుకున్నాక తినడానికని తమ దగ్గర ఉన్నఆహార పొట్లాలను తెరిచారు. సరిగ్గా ముద్ద నోట్లో పెట్టుకోబోతున్నంతలో ఎవరో దబ్బున పడిపోయిన శబ్దం విని అటు చూశారిద్దరూ. ఎవరో బాటసారి అటుగా వెళ్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు.
ధర్మయ్య ముద్దను పళ్ళెంలో పడేసి పరుగు పరుగున వెళ్ళి  అతనిని  లేవదీసి ముఖం మీద నీళ్ళు చిలకరించి సపర్యలు చేశాడు. కాసేపటికి తెప్పరిల్లాడు బాటసారి. అతని మాటల్లో అతను అన్నం తిని చాలా రోజులయ్యిందని అర్ధమయి బాధపడ్డాడు ధర్మయ్య.
చంద్రయ్య వద్దని వారిస్తున్నా వినకుండా ధర్మయ్య తన ఆహారాన్ని అతనికి తినమని పెట్టేశాడు.
ధర్మయ్య ఇచ్చిన ఆహారాన్ని కొంచెం కూడా వదలకుండా మొత్తం తినేసి ధర్మయ్యకు నమస్కరించి తన దారిన తాను వెళ్ళిపోయాడు బాటసారి.
ఏమాత్రం ముందు చూపు లేకుండా ధర్మయ్య తన ఆహారాన్ని ఆ బాటసారికి పెట్టేశాడు. ఆ బాటసారిలా ఆహారం తినని ధర్మయ్య కూడా ఎక్కడైనా పడిపోతే అతనికి తన ఆహారాన్ని ఎక్కడ పెట్టాల్సివస్తుందోనని మొత్తం తినేసాడు చంద్రయ్య.  ఆకలితోనే ప్రయాణం మొదలుపెట్టాడు ధర్మయ్య.
ఆహారం తినే తన కంటే ఏమీ తినని ధర్మయ్య ఎటువంటి అలసట లేకుండా నడవటం చూసి ఆశ్చర్యపోయాడు చంద్రయ్య.
మరి కొంత దూరం వెళ్ళేసరికి దారిలో ఒంటి మీద నూలుపోగైనా లేకుండా రహదారి పక్కన చలికి వణికిపోతున్న వృద్ధుడు కనిపించాడు వాళ్ల్లిద్దరికీ. అతనిని చూసిన మరుక్షణమే ఏమాత్రం ఆలోచించకుండా ధర్మయ్య తన కూడా తెచ్చుకున్న కంబళిని అతనికి కప్పాడు.
“మనం చాలా దూరం ప్రయాణం చేయాలి. నువ్వు ఇబ్బంది పడతావు..” అని చంద్రయ్య అంటున్నా పట్టించుకోలేదు ధర్మయ్య. కడుపులో ఆహారం లేదు. ఒంటి మీద కంబళి లేదు. అయినా ఎంతో ఉత్సాహంగా నడుస్తూన్న ధర్మయ్యని ఆశ్చర్యంగా చూసాడు చంద్రయ్య.
మరికొంత దూరం వెళ్లేసరికి మధ్యాహ్నం ఎండలో నడవలేక నడుస్తున్న ఒక వృద్దురాలు కనబడింది. ఆమెని చూసి జాలేసి తన గొడుగును ఆమెకి ఇచ్చేసాడు ధర్మయ్య. అలాగే చెప్పులూ, చేతిలో కర్ర.. ఇలా ఒక్కొక్కటీ ఇచ్చేస్తూ మరింత ఉత్సాహంగా ముందుకు నడవసాగాడు ధర్మయ్య.
ఇక ఉండబట్టలేక..అడిగేశాడు చంద్రయ్య.
“ధర్మయ్యా.. కడుపులో తిండి లేదు.  ఒంటి మీద కంబళి లేదు. తల మీద గొడుగు లేదు. కాళ్ళకి చెప్పులూ, చేతిలో కర్రా ఏవీ లేవు. అయినా నీ నడకలో కానీ, నడతలో కానీ మార్పు లేదు. అవన్నీ ఉన్న నాకంటే నువ్వే ఆనందంగా, హాయిగా కనిపిస్తున్నావు. నాకు ఆశ్చర్యంగా ఉంది. కారణం ఏమిటి? తెలుసుకోవచ్చా..?” అన్నాడు చంద్రయ్య.
“అలా ఇవ్వటమే ..” అన్నాడు ఏమాత్రం తొణకకుండా ధర్మయ్య.
ఏమీ అర్ధం కానట్టు చూశాడు చంద్రయ్య.
“నా దృష్టిలో తోటివాడి ఇబ్బంది పట్టించుకోవటం కంటే ముఖ్యమైనదీ, ఆనందమైనదీ ఏదీ లేదు చంద్రయ్యా... ఉన్నవాళ్ళు లేని వాళ్లకు ఇవ్వటమే ధర్మం. ధర్మంలో ఆనందం ఉంది. ఆ ఆనందం ఎక్కడా లేని శక్తిని ఇస్తుంది. ఆ శక్తే మనలను నడిపిస్తుంది. పండ్లను ఇచ్చే చెట్టు ఎన్ని గాలివానలొచ్చినా నదరక బెదరక పచ్చగా కళకళలాడుతుందంటే కేవలం మనం పోస్తున్న చెంబుడు నీళ్లు వలన కాదు చంద్రయ్యా.. ప్రతి రోజూ పండ్లనివ్వటం ద్వారా అది చేస్తున్న మేలు ఇచ్చే సంతోషమే దానికా పచ్చదనాన్ని ఇస్తుంది. ఒక్క చెట్లే కాదు... చెరువులూ, చేలూ, పక్షులూ, జంతువులూ ఇవన్నీ మన నుంచి ఏమీ కోరుకోకుండానే అన్నీ మనకిస్తూ అవి ఆనందాన్ని  పొందుతున్నాయి.
ఇప్పుడు అర్ధమయ్యిందా..? ఇవ్వటంలో ఉన్న శక్తి ఏమిటో?" అన్నాడు ధర్మయ్య.
అర్ధమయ్యిందంటూ తలూపుతూ ధర్మయ్య ధర్మబుద్ధికి మనసులోనే నమస్కరిస్తూ అతనిని అనుసరించాడు చంద్రయ్య.

                   - రచన: కన్నెగంటి అనసూయ