Sunday 30 August 2015

No comments:
చిట్టి కథలు-4

                                        దున్నవలె

          పార్వతీపురం జమీందారు పార్వతీశం తరతరాలుగా వచ్చిన ఆస్తినంతా కోల్పోయినా అహంభావం ఏమాత్రం తగ్గక ప్రజలందరికీ దూరంగా ఉంటూ వచ్చాడు. అతనికి ఎవరితోనూ మంచిగా మాట్లాడడం  రాలేదు. గతంలో అతనికి సహాయకునిగా పనిచేసిన గౌరప్ప కవి అతని ఆర్ధిక పరిస్థితిని గమనించి “ఊరిలో రైతుల్ని పిలుచుకొచ్చాను. మీరు ఒక్కసారి మీ భూముల్ని దున్నమని చెప్పండి చాలు”  అని సలహా ఇచ్చాడు. 
           బయట ఉన్న రైతులనుద్దేశించి “ఎవరక్కడ.. దున్నవలె” అన్నాడు పార్వతీశం. అంతే.. జమీందారు తమను దున్నలవలె ఉన్నామని తిట్టినట్లు భావించిన రైతులు అక్కడనుంచి వెళ్ళిపోయారు.
              పాపం.. గౌరప్ప కవి అవాక్కయ్యాడు. 

                        రచన: తుంబలి శివాజీ

Wednesday 26 August 2015

No comments:
చిట్టి కథలు-3


                            గతుక్కు పులి

                 ల్లితో మైదానంలోకి  వచ్చిన ఒక జింకపిల్ల మేత మేస్తూ అక్కడే ఉండిపోయింది. ఆ పిల్లను గమనించని తల్లి వెళ్లిపోయింది. ఇంతలో బెబ్బులి వచ్చి జింకపిల్లని తరిమింది. పులికి అందకుండా వేగంగా పరిగెడుతున్న జింకపిల్లకి “కష్టం వచ్చినప్పుడు ఎదురీదాలి” అన్నతల్లి మాట గుర్తుకి వచ్చింది. అంతే.. వేగంగా పరిగెడుతూన్న జింకపిల్ల  పులికి అడ్డం తిరిగింది.
        ఏం జరిగిందో అర్థం కాని పులి గతుక్కుమని ఆగిపోయింది. ఒక్కసారిగా తన వైపు ధైర్యంగా జింకపిల్ల ఎందుకొస్తుందా అని ఆలోచించి, ‘అక్కడ ఎవరైనా వేటగాడు ఉన్నాడేమో’ అని భయపడి పులి కూడా అంతే వేగంగా వెనక్కి తిరిగి కాలికి బుద్ధి చెప్పింది. ­      

                                                                                           రచన: తుంబలి శివాజీ

Monday 24 August 2015

No comments:
చిట్టి కథలు-2
                                 

                                      జ్వరమొస్తుంది

    ఒకటో తరగతి గదిలో పిల్లలంతా గొడవ గొడవ చేస్తున్నారు. ఉపాధ్యాయురాలు ఎంత చెబుతున్నా ఒక పాప మాత్రం లంకించుకున్న ఏడుపుని ఏమాత్రం ఆపడం లేదు.
          “ఏంటమ్మా! ఏమైంది?” అడిగింది ఉపాధ్యాయురాలు.
“నా పెన్సిల్ పోయింది. ఎవరో దొంగిలించారు...” అంది పాప.
“అయ్యో! మరిప్పుడెలా? ఇదుగోండి.. ఎవరైనా తన పెన్సిల్ తీస్తే ఇచ్చేయండి. నేను ఎవరినీ ఏమీ అనను” చెప్పింది ఉపాధ్యాయురాలు. అందరూ మిన్నకున్నారు. “ఆ పెన్సిల్ దొంగిలించినవారికి ఈ రాత్రి తప్పకుండా జ్వరమొస్తుంది..“ భయపెట్టింది ఉపాధ్యాయురాలు.
అంతే! ఆ పక్కనున్న చిన్నారి సౌమ్య “నాకివ్వేళ జ్వరమొస్తుంది... వా...” అంటూ కెవ్వున ఏడ్చింది. “నీకేం జ్వరం రాదుగా.. ఆ పెన్సిల్ ఆ పాపకి ఇచ్చేస్తాంగా..” అంటూ బుజ్జగించింది ఉపాధ్యాయురాలు.     
                                                                                                                      రచన: తుంబలి శివాజీ

Friday 21 August 2015

1 comment:
చిట్టి కథ-1

                                    తుంటరి చేప కథ

          పారుతున్ననదిలో ఒక చేప పిల్ల తుళ్ళుతూ ఎగురుతోంది. ఆకాశంలోకి ఎగురుతూ పల్టీలు కొడుతోంది.
          అది గమనించిన కప్ప, చేప దగ్గరకు వెళ్లి "అంతలా ఎగరడం ఏమంత మంచిది కాదు. కొంచెం అదుపులో ఉంటే మంచిది" అని హితవు చెప్పింది.
          "చాల్లే... పెద్ద చెప్ప వచ్చావు.." అంటూ చేప కప్ప మాటను ఖాతరు చేయ లేదు.
        ఇంతలో ఒక జాలరి అటుగా వచ్చాడు. నీటి పై నుంచి అంత ఎత్తు ఎగిరే చేపను చాలా సునాయాసంగా చేతుల్లోకి అందుకున్నాడు. ఎటువంటి వేట లేకుండానే చిక్కిన చేపను తీసుకుని తన బుట్టలో వేసుకున్నాడు.
                                                                                                                              
                                                                                                                      రచన: తుంబలి శివాజీ