Monday 28 September 2015

No comments:
చిట్టి కథలు-11

                         అమ్మా.. నాన్నొచ్చాడు!
ప్రణతికి అమ్మంటే ప్రాణం. అమ్మ తను ఏం చేసినా తన మేలు కోరే చేస్తుంది. ఈ ప్రపంచంలో అమ్మ కంటే గొప్పది ఏదీ లేదు. అమ్మ ప్రణతికి ఆటలతో పాటే అన్నీ నేర్పిస్తుంది. అయితే అమ్మకి నాన్నంటే భయం. ఆతను తనను సరిగా అర్థం చేసుకోడని ప్రతి విషయంలోనూ జాగ్రత్తపడుతూ వస్తుంది.
ఇంట్లో ఓ మూల డబ్బులు ఎవరికీ కనబడకుండా లెక్కపెట్టుకుంటున్న అమ్మను చూసి ప్రణతి “ఏంటమ్మా.. అన్ని డబ్బులు నీకు ఎక్కడివి? నాన్న ఇచ్చాడా?” అని అడిగింది. “ష్...ఈ డబ్బులు మనం దాచుకుంటున్న సంగతి నాన్నకి తెలియకూడదు. ఎట్టి పరిస్థితులలోనూ చెప్పవద్దు” అని చెప్పింది అమ్మ. సరేనంది ప్రణతి. సాయంకాలం ఆఫీసు నుండి నాన్న వచ్చేసరికి “అమ్మా! నాన్నొచ్చాడు.. నీ  డబ్బులన్నీ కనబడకుండా.. దాచీ...” అంది ప్రణతి అమాయకంగా.
అమ్మ భయంతో వణికిపోయింది. నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి. అర్థం చేసుకున్న నాన్న ఓ చిరునవ్వునవ్వి “పాపకి ఇటువంటివి నేర్పకు” అని అ­­మ్మను, పాపను అక్కున చేర్చుకున్నాడు. 
                      రచన: తుంబలి శివాజీ

Wednesday 23 September 2015

No comments:
చిట్టి కథలు-10

                            స్వామివారేరి?
          ప్రసాదు ఇంటి బయట చదురు మీద కూర్చొని తెలుగువాచకంలో పద్యాలు బిగ్గరగా రాగయుక్తంగా చదువుకుంటున్నాడు. ఇంట్లోనుండి అమ్మ “నాయనా! స్వామివారొచ్చారా?” అని ప్రతి రొజూ భిక్షకు వచ్చే దాసరిని ఉద్దేశించి అడిగింది. చదువులో నిమగ్నమైన ప్రసాదుకి అమ్మ పిలుపు వినబడలేదు. 
       అమ్మ చేతిలో చిన్న పళ్ళెంతో దాసరికి బియ్యం వేసేందుకు బయటకు వచ్చింది. బయట చూస్తే దాసరి కనబడ లేదు. లోనికి వెళ్ళిపోయింది. మరలా దాసరి రాగాలు వినబడి వచ్చి చూసింది. ఈ సారీ దాసరి కనబడ లేదు. ఇలా మూడు సార్లు జరిగింది.
ఈమారు దాసరి కోసం ఎదురుచూస్తూ బయటే కూర్చుంది అమ్మ.  ప్రసాదు మరల పద్యాలూ చదవడం ప్రారంభించాడు. అది విన్న అమ్మ విరగబడి నవ్వింది. ఇంత వరకు తాను దాసరి పద్యాలుగా పొరపడింది ప్రసాదు చదువుతున్న పద్యాలు వినే.
                           రచన: తుంబలి శివాజీ

Sunday 20 September 2015

No comments:
చిట్టి కథలు-9

                              సున్నపు కాయ
          టింకు సెలవులకు వాళ్ళ నాన్నతో కలిసి నాన్నమ్మను చూడడానికి తాతగారి ఇంటికి వెళ్ళాడు.  నాన్నమ్మ ప్రేమతో టింకును దగ్గరకు తీసుకుని ముద్దాడింది. కథలెన్నో చెప్పింది. అలా సెలవులకు నాన్నమ్మను చూడడానికి  వెళ్ళడం అతనికి ఎంతో ఇష్టం.  
నాన్నమ్మ టింకుపై ఎంతో ప్రేమను చూపిస్తూ “మనవడా.. సున్నపుకాయ తెస్తే నీకు కావలసినన్ని డబ్బులు ఇస్తాను” అంది. అంతే వెంటనే జేబులో డబ్బులు చూసుకుంటూ దుకాణాలకి పరుగులు పెట్టాడు. ఏ కొట్లోనూ అతనికి సున్నపుకాయలు దొరకలేదు సరి కదా అది విన్న వాళ్ళందరూ ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక అయోమయంతో, డీలా పడుతూ నాన్నమ్మ దగ్గరకు వచ్చి విషయం  చెప్పాడు.
 నాన్నమ్మ ఫకాలున నవ్వి, “సున్నపుకాయ అంటే డబ్బులు దాచుకునే ఇదిరా..” అంటూ ఎప్పుడూ తన కొంగుకు కట్టుకునే అలవాటు ఉన్నా ఆ రోజు గూట్లో మరచి పోయిన రెండు కప్పులతో కూడిన గుండ్రని ‘ఇత్తడి కిడ్డీ బ్యాంకు’ చూపించింది. తన అజ్ఞానానికి సిగ్గుపడ్డాడు టింకు.
                         రచన: తుంబలి శివాజీ

Friday 18 September 2015

అలరించే కార్టూన్లు

2 comments:
కార్టూన్లు-1

"ఆనందబాల" ఆబాలగోపాలాన్ని అలరించడానికి కార్టూన్లను అందిస్తోంది. ఆహ్లాదకరమైన ఈ   కార్టూన్లను చూసి ఎంతో ఆనందించవచ్చు..

Monday 14 September 2015

No comments:
చిట్టి కథలు-8
                                పకాళే కావాలి!  పకాళే కావాలి!
   భాను చాలా అల్లరివాడు. ఎప్పుడూ తిండికి ఏదో ఒకటి ఇమ్మని అమ్మను మారాం చేస్తుంటాడు. బడికి వెళ్ళాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఆ రోజు బడి సెలవు. నిద్ర లేచిన దగ్గరనుండి తిండి కోసం అల్లరి చేస్తున్నాడు. అమ్మ అతన్ని ఏమాత్రమూ విసుక్కోకుండా అడిగినవన్నీ ఇస్తోంది. అమ్మ అడిగినవి ఇస్తుండడంతో అది కాదంటే ఇది, ఇది కాదంటే అది అని అడుగుతూ అమ్మను విసిగిస్తున్నాడు.
   వ్యవసాయదారుడైన తాతయ్య అప్పుడే వచ్చి “అమ్మా.. ఆకలేస్తోంది. పకాళి వడ్డించవే” అన్నాడు. తాతయ్య ఏం తిన్నాడో చూడని భాను “నాకు పకాళే కావాలి” అంటూ అమ్మ ప్రాణాలు తోడేసాడు. “నువ్వు తినలేవురా..” అన్నా వినకుండా అదే కావాలని పట్టుబట్టాడు. “అదే పెడతాను, ఇంకేం అడిగినా ఇవ్వను. సరేనా?” అంటే సరేనని ఒప్పుకున్నాడు.
   “ఇదే పకాళి” అని అమ్మ పెట్టిన నిన్నటి మిగిలిన గంజి అన్నం చూసిన భాను నోట మాట రాలేదు.
                   రచన: తుంబలి శివాజీ

Wednesday 9 September 2015

No comments:
చిట్టి కథలు-7

                                    హోం వర్కు
కాన్వెంట్ నుండి  ఇంట్లోకి పరుగు పరుగున వచ్చిన చిన్నారి లాస్య పుస్తకాల బ్యాగు అందుకుంది అమ్మ. కాళ్ళుచేతులు ముఖం కడుక్కుని రమ్మని చెప్పి ఆ రోజు హోం వర్కు ఏమిచ్చారో చూసింది. లాస్యను నర్సరీలో చేర్పించి ఏడాది కావస్తుంది. అప్పుడే పాపకి హోం వర్కుల బరువు పెరిగింది. పాపం ప్రతి రొజూ లాస్య ఆ హోం వర్కు చేయలేక చతికిల పడుతుంది. అమ్మే ఆ పనంతా చేస్తుంది. తనకి కష్టం  కలగనివ్వని అమ్మను చూసి “అమ్మా.. నన్ను రేపు సాయంకాలం  తీసుకురావడానికి నువ్వు స్కూల్ కి రావాలి” అని కోరింది.
పాప కోరికను మన్నించిన తల్లి మరునాడు స్కూల్ కి వెళ్లింది. స్కూల్  విడచాక ఆఫీస్ గదిలో వేచియున్న తల్లి వద్దకు వచ్చిన చిన్నారి లాస్య “అమ్మా! ఈ రోజు టీచర్ నీకు హోంవర్కు ఇవ్వలేదు...” అంది. అది విన్న అక్కడివాళ్ల అందరి పెదవుల్లో చిరునవ్వు మొలిచింది.

                   రచన: తుంబలి శివాజీ

Sunday 6 September 2015

2 comments:
­­­చిట్టి కథలు-6
                                    అనువాదం
            రెండో తరగతి చదువుతున్న రఘు తన రెండేళ్ల తమ్ముడు హరిని బడికి వెంటబెట్టుకు వచ్చాడు. బడిలో అందరూ ముద్దు ముద్దుగా ఉన్న హరిని చూసి ఆనందపడ్డారు. అతనితో ఆడుకున్నారు. సరదాగా తాము తెచ్చుకున్న తినుబండారాలు అన్నీ పెట్టారు.  
        ఉపాధ్యాయుడు కూడా హరిని చూసి ఎత్తుకున్నాడు. బుజ్జగిస్తూ ముద్దు పెట్టాడు. ఎంతో గారాబు చేసాడు.  ఇంకా సరిగా మాటలు రాని హరిని మాట్లాడించే ప్రయత్నం చేసాడు. "దద్దద్ద.." అంటూ హరి తన నోటికి వచ్చిన ఏవేవో పదాలు పలుకుతున్నాడు. అవేవీ అర్థం కాని ఉపాధ్యాయుడు “మీ తమ్ముడు ఏమంటున్నాడురా?” అని రఘుని అడిగాడు.
“వాడు మిమ్మల్ని దద్దమ్మా అంటున్నాడు సర్. మీరెందుకు పనికిరానివారని, ­­ఇంట్లో మాకు మా అమ్మ తిట్టిన తిట్లన్నీ మిమ్మల్ని తిడుతున్నాడు సర్”
     రఘు జవాబు విన్న ఉపాధ్యాయుడు ఖంగుతిన్నాడు.
                        రచన: తుంబలి శివాజీ

Friday 4 September 2015

No comments:
చిట్టి కథలు-5

                                అర్జంట్.. మెసేజ్.!
          బాబు, దీపు మంచి మిత్రులు. వాళ్ళకి వాళ్ల నాన్నల సెల్ ఫోన్లు బాగా వాడుకోవడం తెలుసు. ఇద్దరూ ఒకరికొకరు మెసేజ్ లు పెట్టుకుంటున్నారు. “అర్జంటు పని ఉంది..” అని దీపుకి మెసేజ్ పెట్టాడు బాబు. “రావాలా?” మెసేజ్ లోనే అడిగాడు దీపు. అర్జంటు అన్న సమాధానం చూసి హుటాహుటిన పరుగులు పెట్టాడు.
   రోజంతా కాళ్ళరిగేలా తిరిగిన దీపుకి బాబు కనిపించలేదు. ఎట్టకేలకు సాయంకాలానికి దొరికాడు. “నీకేమయ్యిందో అర్థం కాక పరిగెట్టి వచ్చేశారా” అన్నాడు దీపు. “అయ్యో.. నిజంగా నీకు అర్థం కాక వచ్చేసావురా.. నాకు అర్జంటు పని ఉందని చెప్పాను.. నీక్కాదు” చల్లగా జవాబిచ్చాడు బాబు.
దీపుకి దిమ్మతిరిగింది.
                                               రచన: తుంబలి శివాజీ