Monday 12 December 2016

Sunday 4 September 2016

AANANDABALA GREETINGS

2 comments:

ఆనందబాల వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

Thursday 7 April 2016

Devullu - Aanandabala Telugu story

2 comments:

            దేవుళ్ళు

   లేఖ చాలా చిన్న పిల్ల. ఇంకా బడిలో చేర్చ లేదు. ఒకరోజు చిన్నారి లేఖ వాళ్ళ  అమ్మతో కలిసి గుడికి వెళ్ళింది. అలా అమ్మతో బయటికి వెళ్ళడమంటే ఆమెకు చాలా ఇష్టం. అలా వెళ్ళినప్పుడల్లా అమ్మ ఏదైనా కొనిస్తే ఇంకా ఆనందం. గుడిలో దేవుడికి దండం పెట్టుకున్నాక అమ్మ, లేఖ  గుడి మంటపంలో చాలా సేపు కూర్చున్నారు. లేఖ చుట్టూ పక్కల అంతా పరిశీలనగా చూస్తోంది. ఓ చోట ఓ సాధువు కళ్ళు మూసుకొని ఏదో పాడుకుంటున్నాడు. 

"అమ్మా! అతను ఏం చేస్తున్నాడు?" అడిగింది లేఖ.

"దేవుడి కోసం పాడుతున్నాడు." చెప్పింది అమ్మ.
 "అమ్మా! అతనికి అన్నం ఎవరు పెడతారు?" అడిగింది లేఖ.
"ఆ దేవుడే పెడతాడు...." చెప్పింది అమ్మ.
 "బట్టలేవరిస్తారు?" అడిగింది లేఖ.
"ఆ దేవుడే ఇస్తాడు...." చెప్పింది అమ్మ.
 "అతనికి డబ్బులెవరిస్తారు?" అడిగింది లేఖ.
"ఆ దేవుడే ఇస్తాడు...." చెప్పింది అమ్మ.
ఇంతలో గుడి బయట ఐస్ క్రీం బండి గంట వినిపించింది. లేఖ అమ్మను ఐస్ క్రీం కొనమంది. అమ్మ ఐస్ క్రీం తేవడానికి వెళ్ళింది.  లేఖ ఆ సాదువునే అలా పరిశీలిస్తూ కూర్చుంది. గుడి నుంచి వెళిపోతున్న భక్తుల్లో ఒకతను ఆ సాదువుకు డబ్బులిచ్చి వెళ్ళాడు. మరొకామె విస్తరి నిండా భోజనం పెట్టి వెళ్ళింది. ఇద్దరు దంపతులు ఆ సాధువుకు కొత్త బట్టలిచ్చి నమస్కరించి వెళ్ళారు. అమ్మ లేఖ దగ్గరకు వచ్చి, ఐస్ క్రీం ఇచ్చి "పద.. మనం ఇంటికి వెల్లిపోదాం.."అంటూ ఆమెను తీసుకుని అక్కడనుండి బయటపడింది.
మార్గ మధ్యంలో అమ్మ " లేఖా.. నువ్వు దేవుడుని చూశావా..?" అని అడిగింది. "చూసానమ్మా.. ముగ్గురు దేవుళ్ళను చూసాను. దేవుళ్ళు ఆ సాధువుకి నువ్వు చెప్పినట్టే అన్నీ ఇస్తారమ్మా.." అంది అమాయకంగా. "ముగ్గురు దేవుళ్ళా...?" అంటూ లేఖ అమాయకత్వానికి నవ్వుకుంది అమ్మ.
              రచన: తుంబలి శివాజీ.   

Wednesday 17 February 2016

No comments:
   ప్రముఖ సినిమా రచయిత, నాటకకర్త, కథకులు శ్రీ నడిమింటి నరసింగ రావు గారు ఈ రోజు (17.2.2016) గుంప సోమేశ్వర క్షేత్రం లో భద్రకాళి ప్రతిష్టాపన కోసం సతీ సమేతంగా  విచ్చేశారు. వారు చిన్నపిల్లకోసం ఆనందబాల చేస్తున్న కృషిని ఎంతగానో కొనియాడారు. వారికి ఆనందబాల ధన్యవాదాలు తెలియజేసుకొంటోంది.

   శ్రీ నరసింగ రావు గారి జన్మ స్థలం కురుపాం (విజయనగరం జిల్లా) . జాతీయ స్థాయిలో నిలబడిన ఏకైక తెలుగు నాటకం "బొమ్మలాట" రచయిత శ్రీ నడిమింటి నరసింగ రావు గారు. రాంగోపాల్ వర్మ "అనగనగా ఒక రోజు", "కళ్ళు" వంటి ఎన్నో సినిమాలకు మాటలను అందించారు.  ఈ టీవీ లో  ఎన్నో డైలీ సీరియల్స్ కి మాటలు అందించారు. వారితో నేను కలిసి ఈ టీవీ "శ్రీభాగవతం" సీరియల్  కి మాటలను రాయడం జరిగింది.
                                          - తుంబలి శివాజీ  

Thursday 4 February 2016

No comments:
బాల సాహితీవేత్తల కథలు-1

                             ధర్మబుద్ధి

చంద్రయ్య, ధర్మయ్య ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ దైవదర్శనానికని కాలినడకన కాశీ బయలుదేరారు. కొంత దూరం నడిచిన తరువాత వారిరువురూ అడవిలో ప్రవేశించారు. కాసేపటికి వారిద్దరికీ ఆకలి వేసింది. దగ్గరలో ఉన్న చెట్టు క్రింద చేరి కాసేపు విశ్రాంతి తీసుకున్నాక తినడానికని తమ దగ్గర ఉన్నఆహార పొట్లాలను తెరిచారు. సరిగ్గా ముద్ద నోట్లో పెట్టుకోబోతున్నంతలో ఎవరో దబ్బున పడిపోయిన శబ్దం విని అటు చూశారిద్దరూ. ఎవరో బాటసారి అటుగా వెళ్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు.
ధర్మయ్య ముద్దను పళ్ళెంలో పడేసి పరుగు పరుగున వెళ్ళి  అతనిని  లేవదీసి ముఖం మీద నీళ్ళు చిలకరించి సపర్యలు చేశాడు. కాసేపటికి తెప్పరిల్లాడు బాటసారి. అతని మాటల్లో అతను అన్నం తిని చాలా రోజులయ్యిందని అర్ధమయి బాధపడ్డాడు ధర్మయ్య.
చంద్రయ్య వద్దని వారిస్తున్నా వినకుండా ధర్మయ్య తన ఆహారాన్ని అతనికి తినమని పెట్టేశాడు.
ధర్మయ్య ఇచ్చిన ఆహారాన్ని కొంచెం కూడా వదలకుండా మొత్తం తినేసి ధర్మయ్యకు నమస్కరించి తన దారిన తాను వెళ్ళిపోయాడు బాటసారి.
ఏమాత్రం ముందు చూపు లేకుండా ధర్మయ్య తన ఆహారాన్ని ఆ బాటసారికి పెట్టేశాడు. ఆ బాటసారిలా ఆహారం తినని ధర్మయ్య కూడా ఎక్కడైనా పడిపోతే అతనికి తన ఆహారాన్ని ఎక్కడ పెట్టాల్సివస్తుందోనని మొత్తం తినేసాడు చంద్రయ్య.  ఆకలితోనే ప్రయాణం మొదలుపెట్టాడు ధర్మయ్య.
ఆహారం తినే తన కంటే ఏమీ తినని ధర్మయ్య ఎటువంటి అలసట లేకుండా నడవటం చూసి ఆశ్చర్యపోయాడు చంద్రయ్య.
మరి కొంత దూరం వెళ్ళేసరికి దారిలో ఒంటి మీద నూలుపోగైనా లేకుండా రహదారి పక్కన చలికి వణికిపోతున్న వృద్ధుడు కనిపించాడు వాళ్ల్లిద్దరికీ. అతనిని చూసిన మరుక్షణమే ఏమాత్రం ఆలోచించకుండా ధర్మయ్య తన కూడా తెచ్చుకున్న కంబళిని అతనికి కప్పాడు.
“మనం చాలా దూరం ప్రయాణం చేయాలి. నువ్వు ఇబ్బంది పడతావు..” అని చంద్రయ్య అంటున్నా పట్టించుకోలేదు ధర్మయ్య. కడుపులో ఆహారం లేదు. ఒంటి మీద కంబళి లేదు. అయినా ఎంతో ఉత్సాహంగా నడుస్తూన్న ధర్మయ్యని ఆశ్చర్యంగా చూసాడు చంద్రయ్య.
మరికొంత దూరం వెళ్లేసరికి మధ్యాహ్నం ఎండలో నడవలేక నడుస్తున్న ఒక వృద్దురాలు కనబడింది. ఆమెని చూసి జాలేసి తన గొడుగును ఆమెకి ఇచ్చేసాడు ధర్మయ్య. అలాగే చెప్పులూ, చేతిలో కర్ర.. ఇలా ఒక్కొక్కటీ ఇచ్చేస్తూ మరింత ఉత్సాహంగా ముందుకు నడవసాగాడు ధర్మయ్య.
ఇక ఉండబట్టలేక..అడిగేశాడు చంద్రయ్య.
“ధర్మయ్యా.. కడుపులో తిండి లేదు.  ఒంటి మీద కంబళి లేదు. తల మీద గొడుగు లేదు. కాళ్ళకి చెప్పులూ, చేతిలో కర్రా ఏవీ లేవు. అయినా నీ నడకలో కానీ, నడతలో కానీ మార్పు లేదు. అవన్నీ ఉన్న నాకంటే నువ్వే ఆనందంగా, హాయిగా కనిపిస్తున్నావు. నాకు ఆశ్చర్యంగా ఉంది. కారణం ఏమిటి? తెలుసుకోవచ్చా..?” అన్నాడు చంద్రయ్య.
“అలా ఇవ్వటమే ..” అన్నాడు ఏమాత్రం తొణకకుండా ధర్మయ్య.
ఏమీ అర్ధం కానట్టు చూశాడు చంద్రయ్య.
“నా దృష్టిలో తోటివాడి ఇబ్బంది పట్టించుకోవటం కంటే ముఖ్యమైనదీ, ఆనందమైనదీ ఏదీ లేదు చంద్రయ్యా... ఉన్నవాళ్ళు లేని వాళ్లకు ఇవ్వటమే ధర్మం. ధర్మంలో ఆనందం ఉంది. ఆ ఆనందం ఎక్కడా లేని శక్తిని ఇస్తుంది. ఆ శక్తే మనలను నడిపిస్తుంది. పండ్లను ఇచ్చే చెట్టు ఎన్ని గాలివానలొచ్చినా నదరక బెదరక పచ్చగా కళకళలాడుతుందంటే కేవలం మనం పోస్తున్న చెంబుడు నీళ్లు వలన కాదు చంద్రయ్యా.. ప్రతి రోజూ పండ్లనివ్వటం ద్వారా అది చేస్తున్న మేలు ఇచ్చే సంతోషమే దానికా పచ్చదనాన్ని ఇస్తుంది. ఒక్క చెట్లే కాదు... చెరువులూ, చేలూ, పక్షులూ, జంతువులూ ఇవన్నీ మన నుంచి ఏమీ కోరుకోకుండానే అన్నీ మనకిస్తూ అవి ఆనందాన్ని  పొందుతున్నాయి.
ఇప్పుడు అర్ధమయ్యిందా..? ఇవ్వటంలో ఉన్న శక్తి ఏమిటో?" అన్నాడు ధర్మయ్య.
అర్ధమయ్యిందంటూ తలూపుతూ ధర్మయ్య ధర్మబుద్ధికి మనసులోనే నమస్కరిస్తూ అతనిని అనుసరించాడు చంద్రయ్య.

                   - రచన: కన్నెగంటి అనసూయ

Friday 22 January 2016

No comments:
ఆనందబాల కామిక్స్ -7
ఆనందబాల రూపొందించే కామిక్స్ చిన్నారులను ఎంతగానో అలరిస్తాయి. త్వరలో వెబ్ లో ప్రసారం కానున్న "ఆనందబాల వీడియోలు" పిన్నా పెద్దలను ఆనందింపజేస్తాయి. ఆనందబాలను వీక్షిస్తూ ఉండండి.  

Thursday 7 January 2016

No comments:
చిట్టి కథలు -17

                             ఎవరీ వాల్ నాన..?
తాతయ్య పిల్లలను దగ్గర కూర్చోపెట్టుకుని కథలు చెప్తున్నాడు. చిన్నారి కోమలి “తాతయ్యా! ఈ కథలన్నీ నీకు ఎవరు చెప్పారు?” అని అడిగింది. “నాకు చిన్నప్పుడు మా నాన్న చెప్పాడు..” సమాధానమిచ్చాడు తాతయ్య. “మరి మీ నాన్నకి?” మళ్ళీ ప్రశ్నించింది. “వాళ్ళ నాన్న..” “మరి అతనికి?” “వాళ్ళ నాన్న..” “మరి అతనికి?” “వాళ్ళ నాన్న..” “మరి అతనికి?” “వాళ్ళ నాన్న..” ..” “మరి అతనికి?” “వాళ్ళ నాన్న..” ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది కోమలి. “అందరికీ వాల్ నానే చెప్పాడా?  ఎవరీ వాల్ నాన... వాల్ డిస్నీ తమ్ముడా..? ఎక్కువ కథలు నేర్చుకున్నట్టున్నాడే.. నన్ను ‘వాల్ నాన’ దగ్గరకి తీసుకెళతావా?..” అని అడిగింది. ఫక్కున నవ్వాడు తాతయ్య. పిల్లల ప్రశ్నలన్నిటికీ ఒపిగ్గా సమాధానాలిచ్చిన తాతయ్య వారి అనుమానాలన్నీ తీర్చి  చక్కని కథలు చెప్పి,­ ఆ వెన్నెల్లో హాయిగా ఆటలాడించాడు.
                                               రచన: తుంబలి శివాజీ

Tuesday 5 January 2016

2 comments:
ఆనందబాల వీడియోలు-1


అందరినీ అలరించడానికి "ఆనందబాల" వీడియోలను రూపొందిస్తున్నది. ఇది సరదా ప్రయత్నం మాత్రమే. చూసి ఆనందించండి. .

Monday 4 January 2016

No comments:
ఆనందబాల కామిక్స్ -6

ఆనందబాల కామిక్స్ చిన్నారులను ఎంతగానో అలరిస్తాయి. చక్కని బొమ్మలతో విషయాన్ని సూటిగా పిల్లలకు నీతి బోధకంగా అందిస్తే అదో ఆనందం. మీ పిల్లలకు ఆనందబాల కథలను పరిచయం చేయండి. వారికి ఇంత చక్కని భాహుమతి ఇచ్చే సంతోషం మీ సొంతం.