Wednesday 30 December 2015

No comments:
శుభాకాంక్షలు

ఆనందబాల... ఆబాలగోపాలం  అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటోంది. ఈ ఏడాది అంతా శుభాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తోంది..పిల్లలలెక్కడున్నాఆనందమే. ఆ పిల్లలను ఆనందపెడితే లోకానందమే. అదే ఆనందబాల లక్ష్యం. ఈ ఏడాది కొత్త సొబగులతో వస్తున్న ఆనందబాలను  వీక్షిస్తూ ఉండండి. శుభమగుగాక. 

Saturday 26 December 2015

No comments:
క చిత్రం వేయి హృదయాలను కదిలిస్తుంది. వేల స్వప్నాలను ఆవిష్కరిస్తుంది. ప్రకృతి అందాలను కళ్ళకు కట్టినట్టు చూపుతుంది. కళాకారులు తనలోని స్పందనలను, తనకు ఎదురైన అనుభవాలను పదిలపరచుకొనేందుకు చిత్రకళను సాధనంగా మలచుకుంటాడు. కోటి  భావాలను ఒక గీతలో ప్రపంచానికి పరిచయం చేయగలడు చిత్రకారుడు.  అనుభూతులను ఆవిష్కరించడమే కాదు అన్యాయాలను ప్రశ్నించడమూ కళకు మరింత కళను తెస్తుంది.  అటువంటి కళాకారులు శ్రీ ఆప్తచైతన్య. పార్వతీపురంలో 27 డిసెంబర్ 2015 నాడు చిత్రకళా ప్రదర్శనను నిర్వహిస్తున్నారు.  ఆబాలగోపాలం ఆనందంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని అరుదైన అనుభూతులను మీ సొంతం చేసుకోండి.   
                                                                                                               - తుంబలి శివాజీ

Tuesday 22 December 2015

No comments:
ఆనందబాల కామిక్స్-5

ఆనందబాల కామిక్స్ చిన్నారులను ఎంతగానో అలరిస్తాయి. చిత్రాలతో చెప్పే కథలు బాలలను ఆకట్టుకోవడమే కాదు, వారి మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకుంటాయి.

Sunday 13 December 2015

No comments:
చిట్టి కథలు-16

                                పంచదార  కారం..!
బుడ్డి వాళ్ళ  అమ్మమ్మగారిల్లు వారింటి పక్కనే ఉంది. తమ ఇంట్లో చీమలెక్కువ ఉన్నాయని బుడ్డి అమ్మ అమ్మమ్మగారింట్లో చక్కెర డబ్బా దాచింది. బుడ్డిని అమ్మమ్మ దగ్గరకు వెళ్లి కప్పు నిండా చక్కెర తీసుకు రమ్మని చెప్పింది అమ్మ.  అతడు అలాగే అని వెళ్లి చక్కెర తీసుకువస్తుండగా గోడ  చాటుకు వచ్చేసరికి అందులో కొంత తినేయాలనే దుర్భుద్ధి పుట్టింది. అలానే చేశాడు. అది ప్రతి రోజూ అలవాటయింది. ఒక రోజు అమ్మ “అమ్మమ్మ దగ్గరకు వెళ్ళు. ఈ కప్పు నిండా ఏమిస్తే అది తీసుకురా” అని తొందర పెట్టింది. పరుగు పరుగున అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి వస్తున్న బుడ్డి చీకట్లో గోడ చాటుకు వచ్చి అందులో ఏముందో చూడకుండా నోట్లో వేసుకున్నాడు. అప్పుడే అమ్మ లైట్ వేసింది. అతనికి నోట్లో కారం, మంట... తట్టుకోలేక పోతున్నాడు. అతని కళ్ళల్లో నీళ్ళు చూసి అమ్మ “ఏమయిందిరా?” అని అడిగింది. “అమ్మా.. పంచదార కారంగా ఉందే..” అంటూ ఏడుపు అందుకున్నాడు. జరిగిన దానికి వెంటనే నవ్వు వచ్చినా అమ్మ మనసు బాధపడి అతనికి తగిన చికిత్స చేసింది. ఆ రోజు నుంచి బుడ్డి ఎటువంటి దొంగ పనీ చేయలేదు.
                      రచన: తుంబలి శివాజీ

Wednesday 9 December 2015

3 comments:
"ఊహలకే రెక్కలోస్తే" జానపద నవల
పిల్లలూ !  భుజం మీద పుస్తకాల సంచి, చేతిలో ఆహారపు బాక్సుతో బడికి  వెళ్ళుతున్నప్పుడో, రోడ్డు మీద ట్రాఫిక్ జాంలో ఇరుకున్నప్పుడో ‘ఈ బాదరబందీలు లేకుండా ఏదైనా పక్షిలా మారిపోయి కావలసిన దగ్గరకు ఎగిరి వెళ్ళగలిగేలా భుజాలకు రెక్కలుంటే బాగుండును అనిపిస్తుంది కదూ!’  గాలిలో ఎగిరి వెళ్ళే పక్షులను చూసినప్పుడల్లా  “వాటి పనే బాగుంది. పుస్తకాలు మొయ్యక్కరలేదు.  ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగక్కర లేదు. గాలిలో ఎగురుతూ నచ్చిన ప్రదేశానికి  వెళ్లొచ్చు . చార్జీలు కట్టక్కరలేదు” అనిపిస్తుంది కదూ! మీకే కాదు చాలా మంది పిల్లలకి  అలాగే  అనిపిస్తుంది.
అలాంటి ఆలోచనే  ఊహలకే రెక్కలొస్తే  నవలా నాయకుడు, యువరాజు  ఆనందవర్మకి కూడా వచ్చింది. కావలసిన రూపంలోకి మారిపోయే మంత్రం ఆనందవర్మకు ఒక వింత వస్తువు ద్వారా తెలుసుకున్న ఆనందవర్మ  నచ్చిన పక్షి రూపంలోకి మారిపోయేవాడు .  అవేం  మాట్లాడుకుంటాయో, ఎలా ప్రవర్తిస్తాయో   తెలుసుకునే వాడు . అంతులేని ఆనందం అనుభవించేవాడు.
తన సైనికులు తిరుగుబాటుకు  కుట్ర చేస్తున్నారని వేగుల ద్వారా విన్న ఆనందవర్మ ,  సైనికులు సమావేశమైన చోటుకి పిచ్చుక రూపంలో వెళ్లి వాళ్ళ ముఖాలు చూడడమే కాకుండా వాళ్ళేం మాట్లాడుకున్నారో వింటాడు. సైనికులని  పిలిచి తనకు తెలిసిన సంగతులు చెప్పి ఎందుకు శిక్షించకూడదో చెప్పమంటాడు. వాళ్ళు బుకాయించినా సరే తప్పించుకోలేక పోతారు. సైనికులoదరినీ ఖైదు చేసి శిక్షిస్తాడు ఆనందవర్మ.
మనసుకి నచ్చిన యువతిని ఆమెకు తెలియకుండా దగ్గర నుండి చూడాలని,  భార్యగా చేసుకోవాలని చిలుక రూపంలో వెళ్లి ఆమెను  కలుస్తాడు ఆనందవర్మ. అప్పుడు ఆమె అందం చూసి ముచ్చట పడి ఆమెనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
అప్పటికీ వింత సరదా తగ్గించుకోమని తెలివైన మంత్రి సలహా ఇస్తుంటాడు ఆన0దవర్మకి. వాటిని పెడచెవిని  పెట్టి మనసుకి నచ్చిన పక్షి రూపంలోకి మారిపోయి విజయాలు సాధిస్తూ , క్లిష్టమైన పరిపాలనా సమస్యలని కూడా సులభంగా పరిష్కరించిన  యువరాజు ఒకసారి  ఆపదలో చిక్కుకుంటాడు. ఆయన ఆపద నుండి బయటపడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు? పక్షి రూపంలోకి మారిపోయి సరదా తీర్చుకోవాలన్న ఆలోచన ఆనందవర్మ జీవితంలో ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? తెలుసుకోవాలంటే మాత్రం “ఊహలకే రెక్కలొస్తే”  నవలను  వెంటనే కొని చదవాల్సిందే. మీరు కూడా మీ ఊహలకు రెక్కలు తొడిగి ఆనందలోకాల్లో విహరించి రావాలనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం? వెంటనే ‘ఊహలకే రెక్కలోస్తే’ నవల కొని చదివెయ్యండి!
ప్రముఖ చిత్రకారుడు తుంబలి శివాజీ చిత్రించిన అందమైన ముఖచిత్రంతో, నాణ్యమైన కాగితంపై బొమ్మలతో ముద్రించిన ఈ నవల ధర 45.00 రూపాయలు మాత్రమే.  ఇది గోత్ర పబ్లికేషన్స్ ప్రచురణ. కాపీలు కావల్సిన వాళ్ళు  గోత్ర పబ్లికేషన్స్, పార్వతీపురం (98492 27509) వారిని సంప్రదించవచ్చు.  లేదా మీకు దగ్గరలోని నవచేత పబ్లిషింగ్ హౌస్ లేదా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ దగ్గర పొందవచ్చు. లేదంటే నవలా రచయితను కింది చిరునామాలో సంప్రదించి పొందవచ్చు.  ఎక్కువ కాపీలు కొనే వారికి డిస్కౌంట్ ఉంటుంది. 
చిరునామా: నారంశెట్టి ఉమామహేశ్వరరావు, ఇంటి నెంబరు:14-1-83, సరస్వతీ నివాస్, గవర్నమెంట్ ఆసుపత్రి రోడ్, సబ్ జైలు ఎదురుగా, బెలగాం, పార్వతీపురం H.O. విజయనగరం జిల్లా (ఆంధ్ర ప్రదేశ్)
CELL: 94907 99203, 7386406905.

                                                - సమీక్ష: గుడ్ల అమ్మాజీ ,పార్వతీపురం.

Thursday 3 December 2015

2 comments:

ఆనందబాల – మరో పాఠశాల
నందబాల చక్కని బాలసాహిత్య వేదిక. ఇది తెలుగు బాలల కోసం ఆవిర్భవించిన సాహితీ సంస్థ. బాలసాహిత్యాన్ని ప్రాణంగా భావించే కవి, చిత్రకారుడు, సినీ గేయ రచయిత తుంబలి శివాజీ (98492 27509) కలలకు రూపం, కళల దీపం. నేటి సాహిత్యంలో కొరవడుతున్న నైతిక విలువలను పెంచేందుకు, బాలలను మంచి సృజనాత్మకత గల వ్యక్తులుగా, మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు, వారి తెలివితేటలను పెంచి, మంచి వ్యక్తిత్వ  నిర్మాణం  చేసేందుకు దోహదపడుతుంది.
ఆనందబాల కథలకు చదివించే గుణం ఉంటుంది. ఈ చక్కని కథలు చదివిన తెలుగు బాలలు వారి పఠన సామర్ధ్యమును పెంచుకోవడంతో పాటు ఆలోచనాత్మకతను పొందుతారు. ఈ కథలు తెలుగు బాలల మనసులను ఎంతగానో ఆహ్లాదపరుస్తాయి. వారిని కలల లోకంలో ఊరేగించి వినోదింపజేస్తాయి మరియు వికాసాన్ని కలిగిస్తాయి.   

బాల సాహిత్యం సార్వజనీనమైనది. శాశ్వత విలువలు కలిగినది. తరతరాలకు నిలిచే సామర్ధ్యం కలిగినది. ఏ సాహితీ వేత్త అయినా బాల సాహిత్య స్పృహ, స్పర్శ లేనిదే పరిపూర్ణుడు కాలేడు. అటువంటి బాలసాహిత్యాన్ని తెలుగు నాట ఆవిష్కరించేందుకు కంకణం కట్టుకున్నది ఆనందబాల. కథలు, గేయాలు, గేయ కథలు, కామిక్ కథలు, ఆబాలగోపాలాన్ని అలరించే అనేక అంశాలతో ఆవిష్కృతమైంది. పత్రికలూ, లఘుచిత్రాలు, సచిత్ర గ్రంథాలు, ఇంకా ఎన్నో రూపాలతో బాలలను అలరిస్తూ, తెలుగు భాషా పరిరక్షణ చేస్తూ తెలుగు నాట ఓ ప్రత్యేకతను సంతరించుకున్నది ఆనందబాల.    

Monday 30 November 2015

4 comments:
చిట్టి కథలు-15

                            దెయ్యం!
డిలో పిల్లలంతా అల్లరి చేస్తున్నారు. వారి ఆటలను కట్టించడానికి ఉపాధ్యాయుడు వారిని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కరిని అడుగుతూ తప్పుడు సమాధానాలను చెప్పని వారిని శిక్షిస్తున్నాడు. ఆ తరగతిలో అల్లరి సూర్యం తన వంతు వస్తుందని భయపడుతుండగానే  ఉపాధ్యాయుడు అతనిని లేపి “ఆస్ట్రేలియా జాతీయ జంతువేది?” అని అడిగాడు. సహాయం కోసం  పక్కనున్న రాము వైపు చూశాడు సూర్యం. అతడూ ఆలోచిస్తూ కంగారు పడవద్దన్నాడు. వెంటనే “కంగారూ” అని సమాధానమిచ్చాడు సూర్యం. ఉపాధ్యాయుడు సూర్యంకి సహాయపడరాదని రాముని తన పక్కకు పిలిచి “మన జాతీయ జంతువేది?” అని అడిగాడు సూర్యాన్ని. మరలా సూర్యం రాము వైపు సహాయం కోసం చూసాడు. రాము తెలివిగా ఆలోచించి, ఉపాధ్యాయునికి తెలియకుండా చేతులు, మూతి వంకరగా పెట్టి పులిలా అభినయించాడు.  అది అర్థం కాని సూర్యం “దెయ్యం” అని ఠక్కున సమాధానమిచ్చాడు. అంతే తరగతిగది అంతా నవ్వులతో నిండిపోయింది. తరువాత ఉపాధ్యాయుడు పిల్లలందరికీ కథలు చెప్తూ దేనికైనా ఇతరులపై ఆధారపడితే వచ్చే ఇబ్బందులను బాగా వివరించాడు.
                      రచన: తుంబలి శివాజీ

Friday 27 November 2015

No comments:
ఆనందబాల కామిక్స్ 4

చిన్నారుల మనసు దోచుకునే ఆనందబాల కామిక్స్ ను అందరూ ఇష్టపడతారు. బాలల సుతి మెత్తని హృదయాలను తాకే  ఈ  కథ మనోహరమైనది. 

Wednesday 18 November 2015

3 comments:
ఆనందబాల కామిక్స్-3

చిన్నారుల ఆనందాలు చిగురులు తొడిగే కథలివి. అంతర్గతంగా హాస్యాన్ని కలిగిన ఈ కథ మిమ్మల్ని తప్పకుండా ఆనందపరుస్తుంది.  

Wednesday 11 November 2015

No comments:
ఆనందబాల కామిక్స్ - 2
చిన్నారుల ఆనందానికి పెద్దపీట వేసే ఆనందబాల ఇలా ఎన్నో కామిక్ కథలను అందిస్తుంది. వీటిని చూసి ఎంతో ఆనందాన్ని పొందవచ్చు. బాలలలో  నైతికతను  పెంచే కథలు అన్ని కాలాలలోనూ సమాజానికి ఉపయుక్తమైనవి.

Saturday 7 November 2015

2 comments:
ఆనందబాల కామిక్స్-1
కామిక్స్ చిన్నారులను ఎంతగానో అలరిస్తాయి. ఆనందబాల చిన్నారుల ఆనందానికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఈ కామిక్స్ ను అందిస్తోంది.




Thursday 5 November 2015

No comments:
హృదయపూర్వక శుభాభినందనలు

బాలగోకులం బాలల సాహిత్య  సాంస్కృతిక సంస్థ ద్వారా నవంబర్ 15 వ తేదీన "బాలనేస్తం" పురస్కారం పొందబోతున్న బాల సాహితీశిల్పులు  మరియు మిత్రులు శ్రీ నారంశెట్టి ఉమా మహేశ్వర రావు మరియు శ్రీ పైడిమర్రి రామకృష్ణ గార్లకు హృదయపూర్వక  శుభాభినందనలు.                               -ఆనందబాల 

Wednesday 28 October 2015

5 comments:
చిట్టి కథలు-14

                      థూ .. థూ.. తూచు యంత్రం!
డుంబుకి నాన్న పది రూపాయలు ఏమైనా కొనుక్కోమని ఇచ్చాడు. డుంబు బడిలోకి వెళ్ళే ముందు బయట ఉన్న బరువు తూచే యంత్రంలో ఒక రూపాయి వేశాడు.  చక్రం గిర్రున తిరిగి ఒక టికెట్ వచ్చింది. అందులో డుంబు బరువుతో పాటు వెనుక ‘మీకు ఎక్కువగా చిరుతిళ్ళు లభిస్తాయి’ అని ముద్రించి ఉంది. మరో రూపాయి యంత్రంలో వేశాడు. ఈ సారి ‘మీకు కోరుకున్నంత డబ్బు వస్తుంది’ అని వచ్చింది. మరో రూపాయి వేశాడు. ‘ఈ ఏడాది బడికి ఎక్కువగా సెలవులు ఉంటాయి’ అని వచ్చింది. తొమ్మిది సార్లు తొమ్మిది రకాలుగా తనను ఆనందపరచే వాక్యాలే వచ్చాయి. నాన్న చిరుతిల్లు కొనుక్కోమని డబ్బులిచ్చినా వాటిని ఇలా వాడడం ఎంతో సంతోషం కలిగించింది.
ఇంకా ఒక్క రూపాయి మాత్రమే మిగిలింది. ‘ఈ రూపాయి ఏవైనా చిరుతిళ్ళు కొనుక్కోవాలా? యంత్రంలో వేయాలా? ’ అని ఆలోచించి, చివరకు యంత్రంలోనే వేశాడు. ఈ సారి టికెట్లో వచ్చిన వాక్యం చూసి డుంబు ఖంగుతిన్నాడు. ‘మీరు అబద్దాల్ని ఎక్కువగా నమ్ముతారు’ అని వచ్చింది. ఈ విషయం తెలిసి అందరూ నవ్వుకుంటారని ఎవరితోనైనా చెప్పుకోవాలన్నాసిగ్గేసింది డుంబుకి.

                      రచన: తుంబలి శివాజీ

Sunday 18 October 2015

No comments:
చిట్టి కథలు-13
                              కాకెత్తుకెళ్లింది!
చిన్నికి అమ్మ “కాసేపు బయట ఆడుకో తల్లీ..” అని తినడానికి ఒక జంతికను ఇచ్చింది. చిన్ని బయటకు వచ్చాక ఎదురుగా ఒక కాకి కనిపించింది. అప్పుడే చిన్నికి ఒక ఆలోచన వచ్చింది. ‘ఈ జంతిక దాచేసి కాకెత్తుకెళ్లింది అని చెప్తే అమ్మ ఇంకో జంతిక ఇస్తుంది కదా..’  అనుకుని ఆ జంతికను గోడ చాటున పెట్టి అమ్మ దగ్గరకు వెళ్లి “అమ్మా! జంతికను కాకెత్తుకెళ్లింది” అని చెప్పింది. “అయ్యో... సరేలే.. ఇందా” అని మరో జంతిక ఇచ్చింది అమ్మ. ఇదేదో బాగుందనుకుని ఐదారు సార్లు ఇలానే చేసింది చిన్ని. అమ్మకు అనుమానం వచ్చి “ జంతికలన్నీనిజంగా కాకే ఎత్తుకెళ్లిందా?” అని అడిగింది.  “నిజమమ్మా నీ మీద ఒట్టు..” అని నమ్మబలికింది చిన్ని. “పదా.. చూస్తాను” అని అమ్మ చిన్నితో బయటకు వచ్చింది. గోడ చాటున తను దాచుకున్న జంతికలను నిజంగానే కాకి ఎత్తుకెళ్ళడం చూసిన చిన్ని“వా....” అంటూ బావురుమంది. అయితే ఇంతవరకు ఏడవని చిన్ని ఇప్పుడెందుకు బావురుమందో అమ్మకు అర్థం కాలేదు. చిన్నిని ఊరడించడానికి అమ్మకు చాలా సేపు పట్టింది.
                                      రచన: తుంబలి శివాజీ

Wednesday 14 October 2015

No comments:
చిట్టి కథలు-12


                               బిస్కెట్ అభిమానం!
క రోజు నర్సరీ చదివే బిందు స్కూల్ దగ్గర ఉన్న చిల్లర కొట్టు వద్దకు వెళ్లి రూపాయి ఇచ్చి వ్యాపారితో “నాకు ఒక బిస్కెట్ పేకెట్ ఇవ్వు” అని అడిగింది. ఆ వ్యాపారికి ఆమె తల్లిదండ్రులు  తెలిసిన వారు, గతంలో సహాయపడ్డవారు. ముద్దుగా, బొద్దుగా ఉన్న బిందు అంటే అతనికీ అభిమానమే. అందుకే అతను అభిమానంతో ఒక రూపాయికే పది రూపాయల బిస్కెట్ పేకెట్ ఇచ్చాడు. ఆమెకు ప్రతి రోజూ అలానే అతను ఇస్తున్నాడు.
ఒకనాడు బిందు పది రూపాయలు ఇచ్చి బిస్కెట్ పేకెట్లు అడిగింది. ఆ వ్యాపారి ఒక బిస్కెట్ పేకెట్ మాత్రమె ఇచ్చి వెళ్ళమన్నాడు.  “ఇంకా తొమ్మిది బిస్కెట్ పేకెట్లు ఏవి?” అని అడిగింది బిందు. “ఒక బిస్కెట్ పేకెట్ మాత్రమే వస్తుంది” అన్నాడు వ్యాపారి. ఒక్కసారిగా ఏడుపు లంకించుకుంటూ “నా డబ్బులు తీసుకున్నావని మా అమ్మతో చెప్తాను ఉండు” అంటూ పరుగందుకుంది బిందు.  నోరు వెల్లబెట్టాడు వ్యాపారి.  

                      రచన: తుంబలి శివాజీ

Monday 5 October 2015

No comments:
aanandabala कार्टून
आप को देखने पर यह कार्टून अपने हंसते हुए रोकने में सक्षम नहीं कर सकते हैं ..

Sunday 4 October 2015

No comments:
అలరించే కార్టూన్లు-2

ఆనందబాల కార్టూన్లు మిమ్మల్ని ఎంతగానో అలరిస్తాయి. ప్రముఖ కార్టూనిస్ట్ తుంబలి శివాజీ గారి ఈ  కార్టూన్ చూడండి. మీరు కడుపుబ్బా నవ్వాల్సిందే. ఈ కార్టూన్ గుర్తుకొచ్చిన ప్రతిసారీ మీరు నవ్వకుండా ఉండలేరు. కావాలంటే చూడండి. ఈ ఆనందాన్ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి.

Monday 28 September 2015

No comments:
చిట్టి కథలు-11

                         అమ్మా.. నాన్నొచ్చాడు!
ప్రణతికి అమ్మంటే ప్రాణం. అమ్మ తను ఏం చేసినా తన మేలు కోరే చేస్తుంది. ఈ ప్రపంచంలో అమ్మ కంటే గొప్పది ఏదీ లేదు. అమ్మ ప్రణతికి ఆటలతో పాటే అన్నీ నేర్పిస్తుంది. అయితే అమ్మకి నాన్నంటే భయం. ఆతను తనను సరిగా అర్థం చేసుకోడని ప్రతి విషయంలోనూ జాగ్రత్తపడుతూ వస్తుంది.
ఇంట్లో ఓ మూల డబ్బులు ఎవరికీ కనబడకుండా లెక్కపెట్టుకుంటున్న అమ్మను చూసి ప్రణతి “ఏంటమ్మా.. అన్ని డబ్బులు నీకు ఎక్కడివి? నాన్న ఇచ్చాడా?” అని అడిగింది. “ష్...ఈ డబ్బులు మనం దాచుకుంటున్న సంగతి నాన్నకి తెలియకూడదు. ఎట్టి పరిస్థితులలోనూ చెప్పవద్దు” అని చెప్పింది అమ్మ. సరేనంది ప్రణతి. సాయంకాలం ఆఫీసు నుండి నాన్న వచ్చేసరికి “అమ్మా! నాన్నొచ్చాడు.. నీ  డబ్బులన్నీ కనబడకుండా.. దాచీ...” అంది ప్రణతి అమాయకంగా.
అమ్మ భయంతో వణికిపోయింది. నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి. అర్థం చేసుకున్న నాన్న ఓ చిరునవ్వునవ్వి “పాపకి ఇటువంటివి నేర్పకు” అని అ­­మ్మను, పాపను అక్కున చేర్చుకున్నాడు. 
                      రచన: తుంబలి శివాజీ

Wednesday 23 September 2015

No comments:
చిట్టి కథలు-10

                            స్వామివారేరి?
          ప్రసాదు ఇంటి బయట చదురు మీద కూర్చొని తెలుగువాచకంలో పద్యాలు బిగ్గరగా రాగయుక్తంగా చదువుకుంటున్నాడు. ఇంట్లోనుండి అమ్మ “నాయనా! స్వామివారొచ్చారా?” అని ప్రతి రొజూ భిక్షకు వచ్చే దాసరిని ఉద్దేశించి అడిగింది. చదువులో నిమగ్నమైన ప్రసాదుకి అమ్మ పిలుపు వినబడలేదు. 
       అమ్మ చేతిలో చిన్న పళ్ళెంతో దాసరికి బియ్యం వేసేందుకు బయటకు వచ్చింది. బయట చూస్తే దాసరి కనబడ లేదు. లోనికి వెళ్ళిపోయింది. మరలా దాసరి రాగాలు వినబడి వచ్చి చూసింది. ఈ సారీ దాసరి కనబడ లేదు. ఇలా మూడు సార్లు జరిగింది.
ఈమారు దాసరి కోసం ఎదురుచూస్తూ బయటే కూర్చుంది అమ్మ.  ప్రసాదు మరల పద్యాలూ చదవడం ప్రారంభించాడు. అది విన్న అమ్మ విరగబడి నవ్వింది. ఇంత వరకు తాను దాసరి పద్యాలుగా పొరపడింది ప్రసాదు చదువుతున్న పద్యాలు వినే.
                           రచన: తుంబలి శివాజీ

Sunday 20 September 2015

No comments:
చిట్టి కథలు-9

                              సున్నపు కాయ
          టింకు సెలవులకు వాళ్ళ నాన్నతో కలిసి నాన్నమ్మను చూడడానికి తాతగారి ఇంటికి వెళ్ళాడు.  నాన్నమ్మ ప్రేమతో టింకును దగ్గరకు తీసుకుని ముద్దాడింది. కథలెన్నో చెప్పింది. అలా సెలవులకు నాన్నమ్మను చూడడానికి  వెళ్ళడం అతనికి ఎంతో ఇష్టం.  
నాన్నమ్మ టింకుపై ఎంతో ప్రేమను చూపిస్తూ “మనవడా.. సున్నపుకాయ తెస్తే నీకు కావలసినన్ని డబ్బులు ఇస్తాను” అంది. అంతే వెంటనే జేబులో డబ్బులు చూసుకుంటూ దుకాణాలకి పరుగులు పెట్టాడు. ఏ కొట్లోనూ అతనికి సున్నపుకాయలు దొరకలేదు సరి కదా అది విన్న వాళ్ళందరూ ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక అయోమయంతో, డీలా పడుతూ నాన్నమ్మ దగ్గరకు వచ్చి విషయం  చెప్పాడు.
 నాన్నమ్మ ఫకాలున నవ్వి, “సున్నపుకాయ అంటే డబ్బులు దాచుకునే ఇదిరా..” అంటూ ఎప్పుడూ తన కొంగుకు కట్టుకునే అలవాటు ఉన్నా ఆ రోజు గూట్లో మరచి పోయిన రెండు కప్పులతో కూడిన గుండ్రని ‘ఇత్తడి కిడ్డీ బ్యాంకు’ చూపించింది. తన అజ్ఞానానికి సిగ్గుపడ్డాడు టింకు.
                         రచన: తుంబలి శివాజీ

Friday 18 September 2015

అలరించే కార్టూన్లు

2 comments:
కార్టూన్లు-1

"ఆనందబాల" ఆబాలగోపాలాన్ని అలరించడానికి కార్టూన్లను అందిస్తోంది. ఆహ్లాదకరమైన ఈ   కార్టూన్లను చూసి ఎంతో ఆనందించవచ్చు..

Monday 14 September 2015

No comments:
చిట్టి కథలు-8
                                పకాళే కావాలి!  పకాళే కావాలి!
   భాను చాలా అల్లరివాడు. ఎప్పుడూ తిండికి ఏదో ఒకటి ఇమ్మని అమ్మను మారాం చేస్తుంటాడు. బడికి వెళ్ళాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఆ రోజు బడి సెలవు. నిద్ర లేచిన దగ్గరనుండి తిండి కోసం అల్లరి చేస్తున్నాడు. అమ్మ అతన్ని ఏమాత్రమూ విసుక్కోకుండా అడిగినవన్నీ ఇస్తోంది. అమ్మ అడిగినవి ఇస్తుండడంతో అది కాదంటే ఇది, ఇది కాదంటే అది అని అడుగుతూ అమ్మను విసిగిస్తున్నాడు.
   వ్యవసాయదారుడైన తాతయ్య అప్పుడే వచ్చి “అమ్మా.. ఆకలేస్తోంది. పకాళి వడ్డించవే” అన్నాడు. తాతయ్య ఏం తిన్నాడో చూడని భాను “నాకు పకాళే కావాలి” అంటూ అమ్మ ప్రాణాలు తోడేసాడు. “నువ్వు తినలేవురా..” అన్నా వినకుండా అదే కావాలని పట్టుబట్టాడు. “అదే పెడతాను, ఇంకేం అడిగినా ఇవ్వను. సరేనా?” అంటే సరేనని ఒప్పుకున్నాడు.
   “ఇదే పకాళి” అని అమ్మ పెట్టిన నిన్నటి మిగిలిన గంజి అన్నం చూసిన భాను నోట మాట రాలేదు.
                   రచన: తుంబలి శివాజీ

Wednesday 9 September 2015

No comments:
చిట్టి కథలు-7

                                    హోం వర్కు
కాన్వెంట్ నుండి  ఇంట్లోకి పరుగు పరుగున వచ్చిన చిన్నారి లాస్య పుస్తకాల బ్యాగు అందుకుంది అమ్మ. కాళ్ళుచేతులు ముఖం కడుక్కుని రమ్మని చెప్పి ఆ రోజు హోం వర్కు ఏమిచ్చారో చూసింది. లాస్యను నర్సరీలో చేర్పించి ఏడాది కావస్తుంది. అప్పుడే పాపకి హోం వర్కుల బరువు పెరిగింది. పాపం ప్రతి రొజూ లాస్య ఆ హోం వర్కు చేయలేక చతికిల పడుతుంది. అమ్మే ఆ పనంతా చేస్తుంది. తనకి కష్టం  కలగనివ్వని అమ్మను చూసి “అమ్మా.. నన్ను రేపు సాయంకాలం  తీసుకురావడానికి నువ్వు స్కూల్ కి రావాలి” అని కోరింది.
పాప కోరికను మన్నించిన తల్లి మరునాడు స్కూల్ కి వెళ్లింది. స్కూల్  విడచాక ఆఫీస్ గదిలో వేచియున్న తల్లి వద్దకు వచ్చిన చిన్నారి లాస్య “అమ్మా! ఈ రోజు టీచర్ నీకు హోంవర్కు ఇవ్వలేదు...” అంది. అది విన్న అక్కడివాళ్ల అందరి పెదవుల్లో చిరునవ్వు మొలిచింది.

                   రచన: తుంబలి శివాజీ

Sunday 6 September 2015

2 comments:
­­­చిట్టి కథలు-6
                                    అనువాదం
            రెండో తరగతి చదువుతున్న రఘు తన రెండేళ్ల తమ్ముడు హరిని బడికి వెంటబెట్టుకు వచ్చాడు. బడిలో అందరూ ముద్దు ముద్దుగా ఉన్న హరిని చూసి ఆనందపడ్డారు. అతనితో ఆడుకున్నారు. సరదాగా తాము తెచ్చుకున్న తినుబండారాలు అన్నీ పెట్టారు.  
        ఉపాధ్యాయుడు కూడా హరిని చూసి ఎత్తుకున్నాడు. బుజ్జగిస్తూ ముద్దు పెట్టాడు. ఎంతో గారాబు చేసాడు.  ఇంకా సరిగా మాటలు రాని హరిని మాట్లాడించే ప్రయత్నం చేసాడు. "దద్దద్ద.." అంటూ హరి తన నోటికి వచ్చిన ఏవేవో పదాలు పలుకుతున్నాడు. అవేవీ అర్థం కాని ఉపాధ్యాయుడు “మీ తమ్ముడు ఏమంటున్నాడురా?” అని రఘుని అడిగాడు.
“వాడు మిమ్మల్ని దద్దమ్మా అంటున్నాడు సర్. మీరెందుకు పనికిరానివారని, ­­ఇంట్లో మాకు మా అమ్మ తిట్టిన తిట్లన్నీ మిమ్మల్ని తిడుతున్నాడు సర్”
     రఘు జవాబు విన్న ఉపాధ్యాయుడు ఖంగుతిన్నాడు.
                        రచన: తుంబలి శివాజీ

Friday 4 September 2015

No comments:
చిట్టి కథలు-5

                                అర్జంట్.. మెసేజ్.!
          బాబు, దీపు మంచి మిత్రులు. వాళ్ళకి వాళ్ల నాన్నల సెల్ ఫోన్లు బాగా వాడుకోవడం తెలుసు. ఇద్దరూ ఒకరికొకరు మెసేజ్ లు పెట్టుకుంటున్నారు. “అర్జంటు పని ఉంది..” అని దీపుకి మెసేజ్ పెట్టాడు బాబు. “రావాలా?” మెసేజ్ లోనే అడిగాడు దీపు. అర్జంటు అన్న సమాధానం చూసి హుటాహుటిన పరుగులు పెట్టాడు.
   రోజంతా కాళ్ళరిగేలా తిరిగిన దీపుకి బాబు కనిపించలేదు. ఎట్టకేలకు సాయంకాలానికి దొరికాడు. “నీకేమయ్యిందో అర్థం కాక పరిగెట్టి వచ్చేశారా” అన్నాడు దీపు. “అయ్యో.. నిజంగా నీకు అర్థం కాక వచ్చేసావురా.. నాకు అర్జంటు పని ఉందని చెప్పాను.. నీక్కాదు” చల్లగా జవాబిచ్చాడు బాబు.
దీపుకి దిమ్మతిరిగింది.
                                               రచన: తుంబలి శివాజీ

Sunday 30 August 2015

No comments:
చిట్టి కథలు-4

                                        దున్నవలె

          పార్వతీపురం జమీందారు పార్వతీశం తరతరాలుగా వచ్చిన ఆస్తినంతా కోల్పోయినా అహంభావం ఏమాత్రం తగ్గక ప్రజలందరికీ దూరంగా ఉంటూ వచ్చాడు. అతనికి ఎవరితోనూ మంచిగా మాట్లాడడం  రాలేదు. గతంలో అతనికి సహాయకునిగా పనిచేసిన గౌరప్ప కవి అతని ఆర్ధిక పరిస్థితిని గమనించి “ఊరిలో రైతుల్ని పిలుచుకొచ్చాను. మీరు ఒక్కసారి మీ భూముల్ని దున్నమని చెప్పండి చాలు”  అని సలహా ఇచ్చాడు. 
           బయట ఉన్న రైతులనుద్దేశించి “ఎవరక్కడ.. దున్నవలె” అన్నాడు పార్వతీశం. అంతే.. జమీందారు తమను దున్నలవలె ఉన్నామని తిట్టినట్లు భావించిన రైతులు అక్కడనుంచి వెళ్ళిపోయారు.
              పాపం.. గౌరప్ప కవి అవాక్కయ్యాడు. 

                        రచన: తుంబలి శివాజీ

Wednesday 26 August 2015

No comments:
చిట్టి కథలు-3


                            గతుక్కు పులి

                 ల్లితో మైదానంలోకి  వచ్చిన ఒక జింకపిల్ల మేత మేస్తూ అక్కడే ఉండిపోయింది. ఆ పిల్లను గమనించని తల్లి వెళ్లిపోయింది. ఇంతలో బెబ్బులి వచ్చి జింకపిల్లని తరిమింది. పులికి అందకుండా వేగంగా పరిగెడుతున్న జింకపిల్లకి “కష్టం వచ్చినప్పుడు ఎదురీదాలి” అన్నతల్లి మాట గుర్తుకి వచ్చింది. అంతే.. వేగంగా పరిగెడుతూన్న జింకపిల్ల  పులికి అడ్డం తిరిగింది.
        ఏం జరిగిందో అర్థం కాని పులి గతుక్కుమని ఆగిపోయింది. ఒక్కసారిగా తన వైపు ధైర్యంగా జింకపిల్ల ఎందుకొస్తుందా అని ఆలోచించి, ‘అక్కడ ఎవరైనా వేటగాడు ఉన్నాడేమో’ అని భయపడి పులి కూడా అంతే వేగంగా వెనక్కి తిరిగి కాలికి బుద్ధి చెప్పింది. ­      

                                                                                           రచన: తుంబలి శివాజీ

Monday 24 August 2015

No comments:
చిట్టి కథలు-2
                                 

                                      జ్వరమొస్తుంది

    ఒకటో తరగతి గదిలో పిల్లలంతా గొడవ గొడవ చేస్తున్నారు. ఉపాధ్యాయురాలు ఎంత చెబుతున్నా ఒక పాప మాత్రం లంకించుకున్న ఏడుపుని ఏమాత్రం ఆపడం లేదు.
          “ఏంటమ్మా! ఏమైంది?” అడిగింది ఉపాధ్యాయురాలు.
“నా పెన్సిల్ పోయింది. ఎవరో దొంగిలించారు...” అంది పాప.
“అయ్యో! మరిప్పుడెలా? ఇదుగోండి.. ఎవరైనా తన పెన్సిల్ తీస్తే ఇచ్చేయండి. నేను ఎవరినీ ఏమీ అనను” చెప్పింది ఉపాధ్యాయురాలు. అందరూ మిన్నకున్నారు. “ఆ పెన్సిల్ దొంగిలించినవారికి ఈ రాత్రి తప్పకుండా జ్వరమొస్తుంది..“ భయపెట్టింది ఉపాధ్యాయురాలు.
అంతే! ఆ పక్కనున్న చిన్నారి సౌమ్య “నాకివ్వేళ జ్వరమొస్తుంది... వా...” అంటూ కెవ్వున ఏడ్చింది. “నీకేం జ్వరం రాదుగా.. ఆ పెన్సిల్ ఆ పాపకి ఇచ్చేస్తాంగా..” అంటూ బుజ్జగించింది ఉపాధ్యాయురాలు.     
                                                                                                                      రచన: తుంబలి శివాజీ

Friday 21 August 2015

1 comment:
చిట్టి కథ-1

                                    తుంటరి చేప కథ

          పారుతున్ననదిలో ఒక చేప పిల్ల తుళ్ళుతూ ఎగురుతోంది. ఆకాశంలోకి ఎగురుతూ పల్టీలు కొడుతోంది.
          అది గమనించిన కప్ప, చేప దగ్గరకు వెళ్లి "అంతలా ఎగరడం ఏమంత మంచిది కాదు. కొంచెం అదుపులో ఉంటే మంచిది" అని హితవు చెప్పింది.
          "చాల్లే... పెద్ద చెప్ప వచ్చావు.." అంటూ చేప కప్ప మాటను ఖాతరు చేయ లేదు.
        ఇంతలో ఒక జాలరి అటుగా వచ్చాడు. నీటి పై నుంచి అంత ఎత్తు ఎగిరే చేపను చాలా సునాయాసంగా చేతుల్లోకి అందుకున్నాడు. ఎటువంటి వేట లేకుండానే చిక్కిన చేపను తీసుకుని తన బుట్టలో వేసుకున్నాడు.
                                                                                                                              
                                                                                                                      రచన: తుంబలి శివాజీ